అప్పుడిక నా సినీ కెరీర్ ముగిసిపోయిందనుకున్నా.. 'గూఢచారి' అభినందన సభలో జగపతిబాబు

  • గూఢచారి సినిమాతో జగపతిబాబు కెరీర్‌కు 30 ఏళ్లు
  • అభినందన సభలో ఉద్వేగంగా మాట్లాడిన సీనియర్ నటుడు
  • ‘గూఢచారి’ని చూసి చాలామంది సిగ్గుపడాలని వ్యాఖ్య
ఆగస్టు 3న విడుదలైన ‘గూఢచారి’ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ సినిమాలో సీనియర్ హీరో జగపతిబాబు కీలక పాత్రలో నటించాడు. ‘గూఢచారి’తో జగపతిబాబు సినీ కెరీర్ 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో జగపతిబాబు మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న పలు విషయాలను వెల్లడించారు.

ఒక్క సినిమా చేస్తే చాలు అనుకున్న తాను 30 ఏళ్లు ఈ రంగంలో ఉన్నానని, ఇంతకంటే ఏం కావాలని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన దర్శక, నిర్మాతలు సహా అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నట్టు చెప్పారు. తన తొలి సినిమాకు చిరంజీవి క్లాప్ కొట్టినప్పుడు ఓ స్టార్ పుట్టబోతున్నాడని అనుకున్నానని, కానీ ఆ తర్వాత తానో ప్లాప్ స్టార్‌ని అని అర్థమైందన్నారు. పన్నెండు ప్లాపులు, మూడేళ్ల గ్యాప్ తీసేస్తే మొత్తం 27 ఏళ్లు చిత్ర పరిశ్రమలోనే ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు.

తనకు అత్యుత్తమమైన రోజు ఏదైనా ఉందంటే ఈ రోజేనని పేర్కొన్న జగపతిబాబు.. కెమెరా ఎదుట తప్ప బయట నటించడం తనకు చేతకాదన్నారు. ఇప్పుడు దర్శకుడు అడవి శేష్ ఓ స్టార్ అంటూ  కొనియాడిన ఆయన ఈ సినిమాకు డబ్బులు తీసుకోకుండా చేసుంటే బాగుండేది అనిపించిందన్నారు. కనీస సౌకర్యాలు కూడా లేకుండా సినిమా తీశారని, గొడ్డు చాకిరీ చేశారని గుర్తు చేశారు. ఈ సినిమాలో తానున్న విషయాన్ని మీడియా కూడా గోప్యంగా ఉంచడం తనకు బాగా నచ్చిందని, మీడియాపై మరింత గౌరవం పెరిగిందని అన్నారు.

‘లెజెండ్’ కంటే మూడేళ్ల ముందు తన జీవితం ఇక అయిపోయిందనుకున్నానని జగపతిబాబు గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాలో తాను నటిస్తానో, లేదో కూడా తెలియదని, వాళ్లు ఎప్పుడు వచ్చి అడ్వాన్స్ ఇస్తారా? అని ఎదురుచూశానని పేర్కొన్నారు. రెమ్యునరేషన్ తాను అనుకున్నదానికంటే ఎక్కువే ఇస్తామన్నారని, అలాగే ఇచ్చారని పేర్కొన్నారు. కేవలం తనపై గౌరవంతోనే అంత ఇచ్చారని వివరించారు. చిత్ర పరిశ్రమలోని అందరూ ‘గూఢచారి’ సినిమాను చూడాలని అన్నారు. ఈ సినిమా కోసం ఎలా కష్టపడ్డారో కొందరు నేర్చుకోవాలని, ఇంకొందరు సిగ్గుపడాలని అన్నారు. ఈ మూడు దశాబ్దాల కాలంలో తనతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పిన జగపతిబాబు... కొందరు వెధవలతో తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
Go Back to Shorts
Tollywood
Jagapathi Babu
Goodachari
Telugu
Actor
Adavi sesh

More Telugu News